: నా గురించి నేను చూసుకుంటాను... మీ పని మీరు చూసుకోండి!: ఇంటర్వ్యూవర్ కు వర్మ రిటార్ట్
తాను తెరకెక్కించనున్న 'వంగవీటి' సినిమా విద్వేషాలు రేపే అవకాశం లేదని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పాడు. వంగవీటి సినిమాపై ఓ టీవీ ఛానెల్ లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ, వివాదాలు రేపేందుకు తాను సినిమాలు తీయడం లేదని చెప్పాడు. ఒకవేళ వివాదం రేగితే కనుక తనకు సంబంధం లేదని స్పష్టం చేశాడు. తాను తెలుసుకున్న అంశాలను తనకు తెలిసిన విధంగా తెరపై సినిమాగా ఆవిష్కరిస్తానని వర్మ వెల్లడించాడు. దానిని ప్రేక్షకులు ఎలా తీసుకుంటారన్నది వారిష్టమని, దానితో తనకు సంబంధం లేదని అన్నాడు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఏ వర్గాన్ని తక్కువ చేసి చూపినా, రెండో వర్గం మీ ప్రాణాలు తీసే అవకాశం ఉందని ఇంటర్వ్యూవర్ హెచ్చరించాడు. దీనికి వర్మ మాట్లాడుతూ, 'మీరు నన్ను బెదిరిస్తున్నారా?' అని ప్రశ్నించాడు. 'నా గురించి నేను చూసుకోగలను, మీ పని మీరు చూసుకోండి' అని సమాధానమిచ్చాడు. 'నేను వివాదం రేపకపోయినా మీరు వివాదం చేయాలని కోరుకుంటున్నారా?...ఏమైనా మీకు అలవాటే కదా, లేని వివాదాన్ని ఉందని చెప్పడం' అంటూ వర్మ రిటార్ట్ ఇచ్చాడు.