: పెట్టుబడిదారులు తెలివిగా వ్యవహరిస్తున్నారు: అరుణ్ జైట్లీ
దేశంలోని వివిధ రాష్ట్రాలు తెలివిగా వ్యవహరిస్తున్నాయని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. విశాఖపట్టణంలో జరుగుతున్న సీఐఐ సమ్మిట్ లో ఆయన మాట్లాడుతూ, పారిశ్రామిక వేత్తలు కూడా తెలివిగా పెట్టుబడులు పెడుతున్నారని, వివిధ అంశాలను క్రోడీకరించి పెట్టుబడి ప్రాంతాలను ఎంచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిని సానుకూలంగా మలచుకునేందుకు వివిధ రాష్ట్రాలు భాగస్వామ్య సదస్సులు ఏర్పాటు చేసి, పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ మధ్య పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలు సమ్మిట్ లు నిర్వహించాయని ఆయన తెలిపారు. విభజన తరువాత ఏపీ స్వరూపం మారిందని అన్నారు. ఏపీలో వ్యాపార అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు, వనరులపై చర్చ వచ్చిందని, దానికి సమాధానంగా ప్రజలు చంద్రబాబును ఎన్నుకున్నారని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన చెప్పారు. చైనా, అమెరికా మార్కెట్ల పతనం వివిధ దేశాల వ్యాపార అవకాశాలు, పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన అన్నారు. వ్యాపార అవకాశాలు పెరిగితే పెట్టుబడులు వస్తాయని ఆయన చెప్పారు.