: ఎన్నేళ్లకు కలిశారు...ఆలింగనం కూడా చేసుకున్నారు!
హిందీ సినీ పరిశ్రమలో అమితాబ్ బచ్చన్ కుటుంబానికి ఓ ప్రత్యేక పేజీ ఉంది. అందులో అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ తో పాటు, భార్య జయాబచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్ కూడా ఉన్నారు. వీరితో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నారండోయ్...అమితాబ్ పేరు వినపడినప్పుడు ఆమె పేరు కూడా వినపడాల్సిందే. ఆమే రేఖ...! అందాల నటిగా పేరున్న రేఖకు అమితాబ్ తో అనుబంధం ఉందన్న వార్తలు దశాబ్దాలుగా నడుస్తున్నాయి. అయితే జయాబచ్చన్ తో వివాహానంతరం అమితాబ్ రేఖతో పెద్దగా నటించలేదు కూడాను. ఇందుకు జయాబచ్చన్ ఆంక్షలే కారణమని వార్తలు వినిపించేవి. సినిమా ఫంక్షన్లలో రేఖ, జయాబచ్చన్ ఎదురపడ్డా చురచురా చూసుకోవడమే తప్ప కలిసి మాట్లాడుకోలేదు. అయితే తాజాగా ముంబైలో జరిగిన ఓ సినిమా ఫంక్షన్ లో జయాబచ్చన్, రేఖ ఎదురు పడ్డారు. దీంతో ఈసారి వీరి వ్యవహారశైలి ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, జయ, రేఖ పలకరించుకున్నారు. అంతేకాదు, ఆత్మీయ ఆలింగనం కూడా చేసుకున్నారు. దీంతో ఆడిటోరియం అంతా చప్పట్లతో మార్మోగిపోయింది.