: మంత్రులు పరిపాలన కోసం కాదు...ఎన్నికల కోసమే: లక్ష్మణ్
టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు పరిపాలన కోసం లేరని బీజేపీ నేత లక్ష్మణ్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మజ్లిస్, టీఆర్ఎస్ పార్టీలు గ్రేటర్ పీఠం కోసం కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఏడాదిన్నర కాలంగా టీఆర్ఎస్ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో వుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 60 వేల ఇళ్లను మంజూరు చేస్తే, ఆ కార్యక్రమాలకు ప్రధానిని ఆహ్వానించలేదని ఆయన మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పని చేస్తామని ఆయన చెప్పారు. ఈ నెల 12న నిర్వహించనున్న సదస్సులో కేంద్ర మంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలు పంచుకోనున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులు కేవలం ఎన్నికల కోసమే పని చేస్తున్నారని, పరిపాలన చేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులన్నీ పక్కన పడేసి మంత్రులు గ్రేటర్ ఎన్నికలంటూ తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు.