: వీఐపీ కల్చర్.. ఎయిర్ ఇండియా ప్రయాణికులు సఫర్!
వీఐపీ కల్చర్.. ఎయిర్ ఇండియా ప్రయాణికులకు ఇబ్బందిగా పరిణమించింది. ఇందుకు నిదర్శనం నిన్న రాత్రి ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఏకంగా ఏడుగంటల పాటు ఆలస్యం కావడమే! ప్రయాణికుల కథనం ప్రకారం... శుక్రవారం రాత్రి 7.30 గంటలకు బయలు దేరాల్సిన ఏఐ విమానంలో ఒక మంత్రి టిక్కెట్ బుక్ చేసుకున్నారు. విమానం బయలు దేరే సమయానికి ఆయన రాలేదు. దీంతో 15 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుందని విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి. ఆ పదిహేను నిమిషాల సమయం క్రమక్రమంగా పెరుగుతూ సుమారు ఏడుగంటల పాటు వేచి చూశామని, చివరకు, తాము ప్రయాణించాల్సిన విమానాన్ని రద్దు చేసినట్లు సిబ్బంది ప్రకటించారని, రీ షెడ్యూల్ చేయమని తాము కోరామని, అయినా సిబ్బంది పట్టించుకోలేదని ప్రయాణికులు చెప్పారు. అయితే, ఏడు గంటల ఆలస్యంగా ఆ మంత్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. రీషెడ్యూల్ చేయాలని ఆయన చెబితే గాని విమానాశ్రయాధికారులు మాటవినలేదని చెప్పారు. అర్ధరాత్రి 2.30 గంటలకు ఆ విమానం బయలుదేరి వెళ్లింది.