: రఘువీరా, కేవీపీ, సీఆర్ ల నిర్బంధం... ఆంధ్ర రత్నభవన్ లో ఉద్రిక్తత
కాంగ్రెస్ పార్టీ బెజవాడ నగర కార్యాలయం ఆంధ్ర రత్నభవన్ లో కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ నగర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును టీడీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసినా, ఎందుకు మద్దతుగా నిలబడరని ఆయన వర్గీయులు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, పార్టీ సీనియర్ నేతలు కేవీపీ రామచంద్రారావు, సి.రామచంద్రయ్య తదితరులను నిలదీశారు. అయినా నేతల నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో ముగ్గురు నేతలను మల్లాది వర్గీయులు పార్టీ కార్యాలయంలోనే నిర్బంధించారు. కల్తీ మద్యం కేసులో మల్లాది విష్ణు అరెస్ట్ నేపథ్యంలో తాజా పరిస్థితులపై సమీక్షించేందుకు రఘువీరాతో పాటు కేవీపీ, సీఆర్ లు నేటి ఉదయం బెజవాడకు వచ్చారు. దీంతో వారిని మల్లాది వర్గీయులు చుట్టుముట్టారు. కల్తీ మద్యం కేసును సాకుగా చూపుతూ విజయవాడలో బలమైన నేతగా ఎదుగుతున్న మల్లాది విష్ణును అధికార పార్టీ కుట్రపూరితంగా ఇబ్బందులకు గురి చేస్తోందని వారు ఆరోపించారు. అధికార పక్షం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంటే, చూస్తూ ఎలా ఊరుకుంటారని కూడా వారు పార్టీ సీనియర్లపై విరుచుకుపడ్డారు. పార్టీ సీనియర్ల నిర్బంధం నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.