: బెజవాడ కాంగ్రెస్ లో ‘కల్తీ’ చిచ్చు!... ‘మల్లాది’ అనుకూల, వ్యతిరేక వర్గాల బాహాబాహీ
కల్తీ మద్యం కేసు బెజవాడ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టింది. ఐదుగురు కూలీలను పొట్టనబెట్టుకున్న కల్తీ మద్యం కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును మొన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం కోర్టు ఆయనకు ఈ నెల 19 దాకా రిమాండ్ విధించింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర కమిటీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణు కొనసాగుతున్నారు. ఈ క్రమంలో కేసులో అరెస్టైన ఆయనను సిటీ కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం నేటి ఉదయం పార్టీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగింది. సమాచారం తెలుసుకున్న విష్ణు అనుచరవర్గం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక పరుగు పరుగున అక్కడికి వెళ్లింది. ఆందోళనకు దిగిన వారిని వారించేందుకు యత్నించింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించివేశారు.