: ‘దాద్రి’ కుటుంబానికి గ్రేటర్ నోయిడాలో నాలుగు ఫ్లాట్లు... అప్పగించిన అధికారులు
గోమాంసం వండాడన్న ఆరోపణతో మతోన్మాద శక్తులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన మొహ్మద్ అఖ్లాక్ కుటుంబ సభ్యులకు... దాదాపు ఐదు నెలల తర్వాత గూడు దొరికింది. ఉత్తరప్రదేశ్ లోని దాద్రిలో గతేడాది సెప్టెంబర్ లో జరిగిన ఘటనలో అఖ్లాక్ ప్రాణాలు కోల్పోగా, అతడి కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతని ఇంటికి నిప్పు కూడా పెట్టారు. దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ఈ ఘటనపై అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం కాస్తంత ఆలస్యంగానే అయినా ఆ కుటుంబానికి అండగా నిలబడింది. దాడిలో గూడు కూడా కోల్పోయిన అఖ్లాక్ భార్య ఇక్రమన్, అతడి ముగ్గురు సోదరులు జాన్ మొహమ్మద్, అఫ్జల్ అహ్మద్, జమీల్ అహ్మద్ లకు గ్రేటర్ నోయిడాలో ఒక్కో ఫ్లాట్ చొప్పున ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రూ.20 నుంచి 24 లక్షల విలువ చేసే ఒక్కో ఫ్లాట్ ను వారికి రూ.9.5 లక్షలకే అందించేందుకు గ్రేటర్ నోయిడా మునిసిపల్ అధికారులు అంగీకరించారు. అఖ్లాక్ కుటుంబ సభ్యులు చెల్లించాల్సిన ఈ మొత్తాన్ని సీఎం అత్యవసర నిధి నుంచి అఖిలేశ్ యాదవ్ విడుదల చేశారు. నేటి ఉదయం ఆ నాలుగు ఫ్లాట్లను గ్రేటర్ నోయిడా అధికారులు అఖ్లాక్ కుమారుడికి అప్పగించారు.