: సీమాంధ్రుల ఓట్ల కోసమే కేటీఆర్ అలా మాట్లాడుతున్నారు: వీహెచ్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన సరదా వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు విమర్శలు చేశారు. గ్రేటర్ ఎన్నికల కోసమే సెటిలర్లపై టీఆర్ఎస్ కపట ప్రేమ ఒలకబోస్తోందన్నారు. సీమాంధ్రలో పోటీకి సిద్ధమంటూ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అంతేగాక, ఓట్ల కోసమే టీఆర్ఎస్ పార్టీ పేరును తెలుగు రాష్ట్ర సమితి అని చెప్పుకుంటున్నారని వీహెచ్ అన్నారు. తెలంగాణ రాకముందు సీమాంధ్రులను రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన టీఆర్ఎస్ వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకువెళతామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిశాక సెటిలర్లను ఆ పార్టీ ఇబ్బందులకు గురి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.