: హైదరాబాద్ లో టీఆర్ఎస్ హోర్డింగులపై గవర్నర్ కు టి.కాంగ్రెస్ ఫిర్యాదు
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన హోర్డింగులపై టి.కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజ్ భవన్ లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, దానం నాగేందర్ లు గవర్నర్ ను కలిశారు. గ్రేటర్ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వివరించారు. హోర్డింగులపై విచారణ జరిపించాలని కోరారు. గ్రేటర్ లో లక్షలాది ఓట్లను తొలగించిన ప్రభుత్వం, ఇప్పటివరకు వాటిలో ఎన్నింటిని సవరించారన్న దానిపై స్పష్టత లేదని విన్నవించారు. వార్డుల విభజన రాజకీయ లబ్ధితో చేశారని, రిజర్వేషన్లు కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని వారు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఆదేశాల మేర 31 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు అన్నారు.