: అన్నా డీఎంకే ప్రభుత్వంలో 25 శాఖల్లో అవినీతి చెద: ఇళంగోవన్
అన్నా డీఎంకే ప్రభుత్వం అవినీతికి ఆలవాలంగా మారిందని, ఆ ప్రభుత్వంలోని 25 శాఖల్లో చోటుచేసుకున్న అవినీతి ఉదంతాలపై తన దగ్గర సమాచారముందని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్ సీసీ) అధ్యక్షుడు ఈ వీకేఎస్ ఇళంగోవన్ పేర్కొన్నారు. దీనిపై పుస్తకాన్ని వెలువరించిన ఆయన అవసరమైతే ఈ అవినీతి పోరాటంలో తాను జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు. జయలలిత ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవినీతిపై గతంలోనే గవర్నర్ రోశయ్యకు వినతి పత్రాన్ని సమర్పించానని పేర్కొన్నారు. ఇది జరిగి 7 నెలలు గడిచినా ఇంకా చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. అందుకే పుస్తకరూపంలో ఈ వివరాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నానని తెలిపారు.