: స్కూలుకెళ్లిన బ్రిటన్ బుల్లి రాకుమారుడు... తాతలా హావభావాల ప్రదర్శన!
బ్రిటన్ లో రాజకుటుంబం ఏం చేసినా అది వార్తే. అందుకే, బ్రిటన్ బుల్లి సెలబ్రెటీ ప్రిన్స్ జార్జ్ స్కూలుకు వెళ్లడం కూడా ఈ రోజు పెద్ద విశేషం అయిపోయింది. తల్లిదండ్రులు, రాజకుటుంబం, వందిమాగధులు, అభిమానులు చూస్తుండగా రాజ ప్రాసాదం నుంచి బుల్లి బుల్లి అడుగులేసుకుంటూ ఇంటి దగ్గర్లోని వెస్ట్ కేర్ మాంటిస్సోరీ స్కూల్ కు రెండేళ్ల ప్రిన్స్ జార్జ్ వెళ్లాడు. రెండు గంటల పాటు స్కూలులో గడిపిన అనంతరం జార్జ్ తిరిగి ఇంటికి చేరాడు. ఇంటికి తిరిగి వస్తున్న ప్రిన్స్ ను చూసి బ్రిటన్ డ్యూక్, డ్యూషెష్ (విలియం, కేట్ దంపతులు) మురిసిపోయారు. ఈ సందర్భంగా కేట్ స్వయంగా బుల్లి యువరాజు జార్జ్ ఫోటోలు తీశారు. చలి నుంచి రక్షణకు బ్లూకలర్ స్వెట్టర్ తొడుక్కున్న జార్జ్ తన తాతను మరిపించాడు. అచ్చం ఆయనలాగే హావభావాలు ఒలికించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ సందర్భంగా తీసిన రెండు ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫోటోలకు విశేషమైన ఆదరణ లభిస్తోంది.