: నితీశ్, కేజ్రీవాల్ లాంటి నకిలీ ముస్లింల వల్లే దేశానికి ముప్పు!: బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్
బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ లోని ముస్లింలు మంచి వారేనని, అయితే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లాంటి నకిలీ ముస్లింల వల్లే దేశానికి ముప్పు అని ఆయన ఆరోపించారు. మీరట్ లో జరిగిన మూడో సత్ సమాగమ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని ముస్లింలంతా మంచి వారేనని ప్రశంసించారు. దేశంలో ఎక్కడున్నా ముస్లింలు క్షేమంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. దేశంలో సహనం నశిస్తోందంటూ వ్యాఖ్యానించి రాద్ధాంతం చేసిన నితీశ్ కుమార్, కేజ్రీవాల్ లు బీహార్ ఎన్నికల తరువాత ఎందుకు దాని మాట ఎత్తడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎన్డీయే ప్రవేశపెట్టిన పథకాలు ముస్లింలకు చేరుతున్నాయని పేర్కొన్న ఆయన, ఏన్డీయే పథకాలను చూసి ప్రతి పక్షాలు భయపడుతున్నాయని అన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, అందులో వివాదం లేదని ఆయన తెలిపారు.