: ఐఎస్ఐఎస్ కి భయపడేది లేదు... అసదుద్దీన్ ఒవైసీ
'ఐఎస్ఐఎస్ గురించి తెలియకపోతే మాట్లాడకు, మాట్లాడితే తీవ్రపరిణామాలు ఉంటాయి' అంటూ ఐఎస్ చేసిన హెచ్చరికలకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటు సమాధానం చెప్పారు. ఐఎస్ఐఎస్ కి తాను భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. 12 కోట్ల మంది ముస్లింలు ఉన్న భారత దేశం నుంచి ఐఎస్ లో కేవలం ఐదుగురు మాత్రమే చేరారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఐఎస్ఐఎస్ కి ఆయన సూచించారు. ఇస్లాం ముసుగులో వందలాది మంది మేధావులను ఐఎస్ఐఎస్ హత్య చేసిందని ఆయన ఆరోపించారు. వేలాది మంది మహిళలను చెరపడుతున్నారని ఆయన విమర్శించారు. ఇస్లాం దేశాలుగా పేరుపడిన అరబ్ దేశాలే ఐఎస్ఐఎస్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్న విషయం ఆయన గుర్తు చేశారు. కేవలం అమెరికా విధానాలే ఐఎస్ఐఎస్ బలోపేతానికి కారణమయ్యాయని ఆయన స్పష్టం చేశారు. భారత్ లోని ప్రతి ముస్లిం దేశాన్ని ప్రేమిస్తున్నాడని ఆయన చెప్పారు. విధ్వంసానికి, మానవ హననానికి పాల్పడడం ఇస్లాంకి వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. ఐఎస్ఐఎస్ లో యువకులు ఎవరూ చేరవద్దంటూ ఆయన పిలుపునిచ్చారు. కాగా, భారత్ లో ఐఎస్ఐఎస్ ను విస్తరిస్తామని ఆ సంస్థ ట్విట్టర్ లో ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.