: చంద్రబాబు బాటలో ‘అమ్మ’...తమిళనాట సంక్రాంతి కానుక, సరుకులతో పాటు రూ.100 నగదు కూడా!
సంక్షేమ పథకాలకు శ్రీకారం, వాటి అమలులో అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్టైలే వేరు. అందుకు నిదర్శనమే ‘అమ్మ క్యాంటీన్లు’. అతి తక్కువ ధరకే సామాన్యులకు నాణ్యతతో కూడిన టిఫిన్, భోజనం అందిస్తున్న అమ్మ క్యాంటీన్లు తమిళనాడు వ్యాప్తంగా కళకళలాడుతున్నాయి. ఏపీలో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడు సరికొత్తగా ప్రవేశపెట్టిన ‘సంక్రాంతి కానుక’ జయలలితను బాగానే ఆకట్టుకున్నట్టుంది. గతేడాది నుంచే ఏపీలో చంద్రబాబు సర్కారు సంక్రాంతి కానుకను ప్రవేశపెట్టింది. పండుగ సందర్భంగా సబ్సిడీ రేట్లకే రేషన్ హోల్డర్లకు సరుకులను పంపిణీ చేస్తున్న పథకానికి ప్రజలు బాగానే స్పందిస్తున్నారు. ఇదే విషయాన్ని గమనించిన జయలలిత తమిళనాడులోనూ తాజాగా సంక్రాంతి కానుకను ప్రవేశపెడుతున్నట్లు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అయితే చంద్రబాబు కంటే ఓ అడుగు ముందుకేసిన జయలలిత, రేషన్ సరుకుల(బియ్యం, పంచదార)తో పాటు రూ.100 నగదును కూడా అందజేయనున్నట్టు ప్రకటించారు.