: ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఓ సర్కస్!... నోబెల్ విన్నర్ వెంకటరామన్ ఘాటు వ్యాఖ్య


భారత సంతతికి చెందిన విశ్వవిఖ్యాత జీవ శాస్త్రవేత్త, నోబెల్ ప్రైజ్ విన్నర్ వెంకటరామన్ రామకృష్ణన్ గతంలో చేసిన ఘాటు వ్యాఖ్యలు తాజాగా కలకలం రేపుతున్నాయి. తమిళనాడుకు చెందిన వెంకటరామన్ చాలాకాలం క్రితమే అమెరికా వెళ్లిపోయారు. అక్కడి ప్రతిష్ఠాత్మక వర్సిటీ కేంబ్రిడ్జీలో స్ట్రక్చరల్ బయాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. 2009లో నోబెల్ బహుమతిని గెలుచుకున్న ఆయన సత్తా చాటారు. అంతటి పేరు ప్రఖ్యాతులు సాధించిన ఆయన ఏటా భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా జరుపుతున్న ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ను ఓ సర్కస్ గా అభివర్ణించారు. అంతేకాక భవిష్యత్తులో తాను ఈ కాంగ్రెస్ కు హాజరు కాబోనని కూడా తేల్చిచెప్పారు. కొత్త ఆవిష్కరణలు, వాటిపై కీలక చర్చలు నిర్వహించాల్సిన సదరు సదస్సులో సైన్స్ కు స్వల్ప చోటు మాత్రమే ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది సదస్సు మైసూరులో జరుగుతోంది. రెండు రోజుల క్రితం స్వయంగా ప్రధాని మైసూరు వెళ్లి సదస్సును ప్రారంభించి వచ్చారు. భారత రత్న సీఎన్ఆర్ రావు సహా ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఈ సదస్సుకు హారజయ్యారు. కొత్త ఆవిష్కరణలతో సత్తా చాటండని ప్రధాని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. అయితే గతేడాది జరిగిన సైన్స్ కాంగ్రెస్ కు హాజరైన ఆయన ఓ రోజంతా సదస్సులో గడిపారు. ఈ సందర్భంగా సదస్సులో సైన్స్ కంటే రాజకీయాలు, మత సంబంధిత విషయాలపై పెద్దగా చర్చ జరగగా, సైన్స్ పై అతి తక్కువ చర్చే జరిగిందట. దీంతో హతాశులైన వెంకటరామన్, ఇకపై ఈ సదస్సుకు హాజరుకాబోనని తేల్చిచెప్పి విసురుగా వెళ్లిపోయారట. తాజాగా మైసూరులో జరుగుతున్న సైన్స్ కాంగ్రెస్ నేపథ్యంలో వెంకటరామన్ చేసిన నాటి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఆసక్తికర కథనాన్ని రాసింది.

  • Loading...

More Telugu News