: సిట్ ముందుకు మల్లాది విష్ణు... కృష్ణలంక పీఎస్ లో విచారణ షురూ
విజయవాడలో ఐదుగురు దినసరి కూలీలను పొట్టనబెట్టుకున్న కల్తీ మద్యం ఘటనలో కొద్దిసేపటి క్రితం కీలక ఘట్టం మొదలైంది. కేసులో 9వ నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు హాజరయ్యారు. తన సోదరుడు మల్లాది శ్రీనివాస్ పేరిట కార్యకలాపాలు సాగిస్తున్న స్వర్ణ బార్ లో చోటుచేసుకున్న ఈ ఘటనపై వేగంగా స్పందించిన పోలీసులు బార్ యజమాని సహా పలువురిని అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్ లో 9వ నిందితుడిగా తన పేరు చేరడంతో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు దాదాపు నెల రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన విష్ణు, ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే హైకోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టివేయడంతో పాటు అరెస్ట్ ఉండబోదని బెజవాడ కోర్టు చెప్పిన తర్వాత మొన్న రాత్రి ఆయన అజ్ఞాతం వీడారు. కొద్దిసేపటి క్రితం ఆయన నేరుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్లి సిట్ ముందు హాజరయ్యారు. ప్రస్తుతం విష్ణును పోలీసులు విచారిస్తున్నారు.