: జేసీ ఎఫెక్ట్... పాత చంద్రబాబు రీ ఎంట్రీ!:జన్మభూమి వేదికపై యువ ఐఏఎస్ పై చంద్రబాబు ఆగ్రహం
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సూచనలు బాగానే పనిచేసినట్లున్నాయి. పాత చంద్రబాబు ఎంటరైపోయారు. నిన్నటిదాకా అధికార యంత్రాంగంపై కాస్తంత మెతక ధోరణితో వ్యవహరించిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తాజాగా తన వైఖరిని మార్చేసుకున్నారు. పదేళ్ల క్రితం సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు వస్తున్నారంటే, అధికారులు హడలెత్తిపోయారు. ఎక్కడ పట్టుబడిపోతామోనన్న భయం వారిని వెంటాడింది. అయితే దాదాపు పదేళ్ల తర్వాత తిరిగి అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు అధికారులపై తన వైఖరిని కాస్తంత మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో పనులు కావడం లేదని... చంద్రబాబు కష్టపడుతుంటే, అధికారులు మొద్దు నిద్రలో జోగుతున్నారని టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత చంద్రబాబు ఎంటరవ్వాల్సిందేనని ఆయన సీఎంకు సూచించారు. జేసీ సూచనల ఫలితమో, ఏమో కానీ ఇటీవల పనిచేయని అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న విజయనగరం జిల్లా పర్యటన సందర్భంగా సరైన లెక్కలు తీసుకురాని మహిళా రెవెన్యూ అధికారిని చంద్రబాబు నిలదీశారు. పనిచేయకుంటే, ప్రమోషన్లు రావని వేదికపై నుంచి హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా నిన్న కృష్టా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చంద్రబాబు ఏకంగా యువ ఐఏఎస్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్టా జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న చంద్రుడును పేరు పెట్టి పిలిచి మరీ, పనిచేయకుంటే వదలబోనని హెచ్చరించారు. ‘‘ఏయ్ నువ్వు ఏం చేస్తున్నావ్.. ఏం తమాషాగా ఉందా? ఇదేం అడ్మినిస్ట్రేషన్? ఇక్కడ రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు? ఏయ్ జేసీ చంద్రుడు.. నువ్వు ఏం చేస్తున్నావ్? నేను ఎవరినీ వదిలిపెట్టను’’ అంటూ చంద్రబాబు నిలదీయడంతో యువ ఐఏఎస్ కు నోట మాట రాలేదట.