: సల్వీందర్ సింగే దోషి?... అందరి దృష్టి ఆయన అనుమానాస్పద వ్యవహార సరళిపైనే!


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాద దాడికి సంబంధించి ఆ రాష్ట్ర సీనియర్ పోలీసు అధికారి, మొన్నటిదాకా సరిహద్దు జిల్లా గురుదాస్ పూర్ ఎస్పీగా పనిచేసిన సల్వీందర్ సింగ్ కీలక వ్యక్తిగా మారిపోయారు. ఎయిర్ బేస్ పై దాడికి రెండు రోజుల ముందు సల్వీందర్ సింగ్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అప్పటిదాకా గురుదాస్ పూర్ జిల్లా ఎస్పీగా పనిచేసిన ఆయన ఇటీవలే పంజాబ్ రిజర్వ్ పోలీసు విభాగంలోని ఓ బెటాలియన్ కు కమాండర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే దాడికి రెండు రోజుల ముందు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వదిలేసి... స్నేహితుడు, నగల వ్యాపారి రాజేశ్, తన వంట మనిషి మదన్ గోపాల్ లను వెంటబెట్టుకుని నీలి రంగు ఉన్న బుగ్గ కారులో ఆయన పఠాన్ కోట్ లోని ఓ స్వామీజీని కలిసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మారణాయుధాలు చేతబట్టిన ఉగ్రవాదులు సల్వీందర్ కారును అటకాయించి కారులోని ముగ్గురిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత సల్వీందర్, మదన్ గోపాల్ లను అక్కడే వదిలేసిన ఉగ్రవాదులు రాజేశ్ ను మాత్రం కొంత దూరం తీసుకెళ్లి గొంతు కోసి కారులో నుంచి తోసివేశారు. అయితే అక్కడి నుంచి పరుగులు పెట్టిన రాజేశ్ ఎలాగోలా ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇక పఠాన్ కోట్ వెళుతున్న సందర్భంగా చెక్ పోస్టుల తనిఖీలకు నీలి రంగు బుగ్గ కారులో సల్వీందర్ వస్తున్నారని పఠాన్ కోట్ కు దారి తీసే మార్గంలో ఉన్న చెక్ పోస్టులకు సమాచారం వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు సల్వీందర్ కారులో ప్రయాణించినా, ఆయా చెక్ పోస్టుల వద్ద ఉన్న సిబ్బంది సెల్యూట్ కొట్టి మరీ సాగనంపారు. ఇక నిన్న మీడియాతో మాట్లాడిన సందర్భంగా రాజేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మదన్ గోపాల్ తో కలిసి సల్వీందర్ తనను మోసం చేశారని ప్రకటించారు. మరోవైపు రాజేశ్... మదన్ గోపాల్ తో పాటు తననూ మోసగించారని సల్వీందర్ ఆరోపించారు. ఈ క్రమంలో ఎయిర్ బేస్ దాకా ఉగ్రవాదులు సులువుగా చేరుకునేందుకు సల్వీందర్ రాజమార్గం ఏర్పాటు చేశారని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే సాధారణ విచారణ సందర్భంగా సల్వీందర్, మదన్ గోపాల్ లను ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు విచారించారు. విచారణ సందర్భంగా సల్వీందర్ పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో సల్వీందర్ ను అదుపులోకి తీసుకోనున్నామని, ఆయనను పూర్తి స్థాయిలో విచారించనున్నామని నిన్న ఎన్ఐఏ డీజీ తెలిపారు. దీంతో పఠాన్ కోట్ ఉగ్రవాద దాడికి సల్వీందర్ సహకరించారన్న దిశగా అనుమానాలు బలపడుతున్నాయి. నేడు ఈ విషయంపై మరింత సమాచారం వెలుగు చూసే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News