: ఒబామా కంట కన్నీరు!... గన్ కంట్రోల్ పై మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైన వైనం
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కంట కన్నీరు ఒలికింది. దేశంలో పెరిగిపోతున్న గన్ కల్చర్ పై మాట్లాడుతున్న సందర్భంగా ఆయన కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. తీవ్ర భావోద్వేగానికి గురైన ఒబామా, గన్ కల్చర్ కారణంగా దేశంలో అసువులు బాసిన చిన్నారులను మననం చేసుకుని దాదాపుగా రోధించారు. మూడేళ్ల నాడు కనెక్టికట్ లోని న్యూటౌన్ లో తుపాకీ చేతబట్టి ఓ పాఠశాలలోకి చొరబడ్డ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. నాటి ఘటనలో 20 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనను మననం చేసుకున్న సందర్భంగా ఒబామా భావోద్వేగానికి లోనయ్యారు. గన్ కల్చర్ కు చెక్ పెట్టే దిశగా తీసుకురానున్న కీలక చట్టంపై నిన్న వాషింగ్టన్ లో ఒబామా భావోద్వేగ ప్రసంగం చేశారు. ‘‘ప్రతిసారీ ఆ చిన్నారుల గురించే ఆలోచిస్తాను. అది గుర్తుకొస్తేనే, పిచ్చోడిగా మారతాను. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే గన్ కంట్రోల్ చట్టం అమల్లోకి రావాల్సిందే. కాంగ్రెస్ ఈ దిశగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. దేశ మాజీ అధ్యక్షుడు మార్టిన్ లూథర్ కింగ్ మాటలను గుర్తు చేసిన ఆయన గన్ కల్చర్ కు చెక్ పెట్టేందుకు పక్కా ప్రణాళికను రూపొందించాల్సిన గురుతర బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థపై ఉందన్న విషయాన్ని నొక్కి చెప్పారు. ‘‘ఈ దిశగా అడుగు వేయడం అత్యవసరం. దేశ ప్రజలు రాలిపోతున్న నేపథ్యంలో దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం తీసుకోబోయే కఠిన చర్యలను ఇకపై గన్ లాబీ ఎంతమాత్రమూ అడ్డుకోలేదని కూడా ఒబామా హెచ్చరించారు. ‘‘ప్రస్తుతానికి కాంగ్రెస్ ను గన్ లాబీ తన గుప్పెట్లో పెట్టుకుంది. అయితే అమెరికాను మాత్రం ఈ లాబీ బందీగా పట్టుకోలేదు’’ అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.