: ఐదురోజులు సోదాలు...అంగుళం కూడా వదిలేది లేదు: పారికర్
పఠాన్ కోట్ లో మరో ఐదు రోజులపాటు తనిఖీలు కొనసాగుతాయని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో సిబ్బందితో పాటు 3000 మంది సాధారణ పౌరులు నివాసం ఉంటున్నారని అన్నారు. సాధారణ పౌరులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత భద్రతా దళాలపై ఉందన్న విషయం గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. ఆపరేషన్ అంటే వ్యాఖ్యలు చేసినంత సులువు కాదు కదా? అని ఆయన ప్రశ్నించారు. భద్రతా దళాలు ఎలాంటి తప్పు జరగకుండా చూస్తున్నాయని, ఒక్క అంగుళం కూడా వదలకుండా సోదాలు నిర్వహిస్తున్నాయని ఆయన చెప్పారు. భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని, వారి సేవలను కీర్తించాల్సిందేనని ఆయన తెలిపారు. ఇలాంటి విషయాలపై వ్యాఖ్యలు చేసినా, వార్తలు రాసినా సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.