: గ్రేటర్ ఎన్నికలంటే టీఆర్ఎస్ కు భయం పట్టుకుంది: బీజేపీ
గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలంటేనే టీఆర్ఎస్ భయపడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, గెలవలేం అన్న భయంతోనే రిజర్వేషన్ల ప్రకటనపై ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియ గడువు కుదింపుతో, ప్రచారం చేసుకోవడానికి ప్రతిపక్షాలకు సమయం లేకుండా చేయడానికే కుట్ర పన్నుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ దివాళా కోరు రాజకీయాలకు ఇది నిదర్శనమని చెప్పిన ఆయన, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు పోటీలో నిలబడి ప్రచారం చేసుకోనీయకుండా కుట్ర జరిగిందని ఆరోపించారు. దొడ్డిదారిన గెలవాలనుకుంటున్న టీఆర్ఎస్ ప్రయత్నాలను వమ్ముచేస్తామని ఆయన స్పష్టం చేశారు.