: కోర్టు మెట్లెక్కిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మధ్యాహ్నం పటియాలా కోర్టుకు వచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై తాను దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు విచారణకు రాగా, విచారణ తీరుతెన్నులను పరిశీలించేందుకు ఆయన కోర్టు మెట్లెక్కారు. ఢిల్లీ క్రికెట్ బోర్డులో జరిగిన అవకతవకల వెనుక జైట్లీ హస్తముందని ఆప్ ఆరోపించగా, తన పరువు పోయిందని జైట్లీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం జైట్లీ తరఫు న్యాయవాది వాదనలు ప్రారంభిస్తూ, డీడీసీఏ నుంచి తన క్లయింటు ఒక్క పైసా కూడా తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. ఆప్ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. ఇక ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని కోర్టు నిర్ణయించింది. కాగా, ఇటువంటి కోర్టు కేసులతో తమను భయపెట్టలేరని, తాము పోరాడుతున్నది అవినీతిపైనని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.