: విచారణకు సహకరిస్తా... పూర్తి వివరాలు రేపు చెబుతానన్న మల్లాది విష్ణు
బెజవాడలో ఐదుగురు దినసరి కూలీల ప్రాణాలు హరించిన కల్తీ మద్యం కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. నిన్న రాత్రి విజయవాడలోని తన ఇంటికి చేరుకున్న ఆయన, కొద్దిసేపటి క్రితం మీడియాతో పొడిపొడిగా మాట్లాడారు. నగరంలోని కృష్ణలంకలో మల్లాది విష్ణు సోదరుడు శ్రీనివాస్ పేరిట స్వర్ణ బార్ నడుస్తోంది. ఈ బార్ లో మద్యం సేవించిన ఐదుగురు కూలీలు చనిపోగా, మరో 25 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. సోదరుడి పేరిట మల్లాది విష్ణునే ఈ బార్ ను నడిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను పోలీసులు కేసులో 9వ నిందితుడిగా చేర్చారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిన విష్ణు, దాదాపుగా నెల పాటు కనిపించకుండా తిరిగారు. నిన్న కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన తన అజ్ఞాతాన్ని వీడక తప్పలేదు. విష్ణు అజ్ఞాతం వీడారన్న సమాచారంతో మీడియా ఆయన ఇంటికి పరుగులు పెట్టింది. మీడియాతో నాలుగు మాటలు మాట్లాడిన విష్ణు... కేసులో జరుగుతున్న విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని ప్రకటించారు. అంతేకాక ఈ ఘటన, అందులో తన పాత్ర తదితరాలకు సంబంధించి పూర్తి వివరాలను రేపు వెల్లడిస్తానని ఆయన చెప్పారు.