: మోదీ, పారికర్ సూచనల ఎఫెక్ట్... పఠాన్ కోట్ లో 3 రోజుల పాటు కౌంటర్ అటాక్!
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై పంజా విసిరిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సుశిక్షిత ఎన్ఎస్జీ కమెండోలకు ఏకంగా 3 రోజుల సమయం పట్టింది. తొలి రోజే నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఇండియన్ కమెండోలు మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి వేసేందుకు ఏకంగా రెండు రోజుల సమయాన్ని తీసుకున్నారు. ఈ విషయంలో ఎన్ఎస్జీ కమెండోల సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తమ సత్తాలో ఎలాంటి మార్పు రాలేదని చెబుతున్న కమెండోలు, అసలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు తీసుకున్న ఎక్కువ సమయంపై పూర్తి వివరణ ఇస్తున్నారు. ప్రాణ నష్టాన్ని నివారించాలని, అనవసర రిస్కులు తీసుకోవద్దని ప్రధాని నరేంద్ర మోదీ సహా, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ భద్రతా దళాలకు ఆదేశాలు జారీ చేశారట. ఉన్నతాధికారుల నుంచి ఈ సందేశాలను అందుకున్న ఎన్ఎస్జీ కమెండోలు, ఉగ్రవాదుల్లో కనీసం ఒక్కరినైనా సజీవంగా పట్టుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే మిగిలిపోయిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు రెండు రోజుల సమయం పట్టిందని కమెండోలు చెబుతున్నారు. ఇక భద్రతా దళాలకు వాటిల్లిన భారీ నష్టంపైనా వారిచ్చిన వివరణ ఉగ్రవాదుల పదునైన వ్యూహాలను వెలుగులోకి తెస్తోంది. ఎయిర్ బేస్ ముఖద్వారం వద్ద సెంట్రీ డ్యూటీలో ఉన్న సిబ్బంది షిప్ట్ మార్చుకుంటున్న క్రమంలో ఉగ్రవాదులు ఒక్క ఉదుటున దాడికి దిగారు. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన మొత్తం ఏడుగురిలో ఐదుగురు అక్కడే చనిపోయారు.