: 'సిగ్గుపడకు, ఇక బయటకు వెళ్దాం' అంటూ టీవీ యాంకర్ తో గేల్ అసభ్య సంభాషణ
క్రిస్ గేల్... వెస్టిండీస్ స్టార్ క్రికెటర్! ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ టీ-20 లీగ్ పోటీల్లో భాగంలో మెల్ బోర్న్ జట్టుకు ఆడుతున్న గేల్, టాస్మానియాపై 15 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. దీంతో అతన్ని ఇంటర్వ్యూ చేసేందుకు ఛానెల్ 10 యాంకర్ మెల్ మెక్ లాలిన్ వచ్చింది. ఆమెతో క్రిస్ అసభ్యకరంగా మాట్లాడాడు. తాను ఆస్ట్రేలియా వచ్చింది ఆమె కోసమేనన్నాడు. ఆమె కళ్లు చూడటానికే వచ్చానని, తన వద్ద సిగ్గు పడవద్దని, మ్యాచ్ గెలిచాం కాబట్టి, ఇక బయటకు వెళ్దామని అన్నాడు. క్రిస్ మాటలతో తొలుత షాక్ తిన్న మెక్, ఆపై తాను సిగ్గుపడట్లేదని నవ్వుతూ చెబుతూనే, లైవ్ ఇంటర్వ్యూ కొనసాగించింది. ఇక దీన్ని చూస్తున్న క్రికెట్ అభిమానులు గేల్ వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు. బిగ్ బాష్ సీఈఓ ఎవెర్డ్ సైతం గేల్ తీరు సరికాదని అన్నారు. కాగా, గతంలోనూ గేల్ ఇదే తరహా వివాదంలో చిక్కుకున్నాడు. ఓ మహిళా విలేకరితో డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడి విమర్శల పాలయ్యాడు.