: శారదా చిట్ ఫండ్ కుంభకోణం చార్జీషీట్ లో చిదంబరం భార్య పేరు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పన్ను ఎగవేతలకు సంబంధించి ఆయన కుమారుడు కార్తీ చిదంబరానికి చెందిన పలు కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. తాజాగా చిదంబరం సతీమణి, దేశంలోనే పేరుమోసిన న్యాయవాది నళిని చిదంబరం పేరు పశ్చిమబెంగాల్ లో కలకలం రేపిన శారదా చిట్ ఫండ్ కుంభకోణం చార్జీషీట్ లోకి ఎక్కింది. శారదా చిట్ ఫండ్ కుంభకోణం దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సీబీఐ ఇప్పటికే ఐదు చార్జిషీట్లను కోర్టుకు సమర్పించింది. తాజాగా నిన్న ఆరో చార్జిషీటును కూడా సీబీఐ కోర్టులో దాఖలు చేసింది. ఈ చార్జిషీటులో నళిని చిదంబరం పేరు ఉంది. నళిని పేరును మాత్రమే ప్రస్తావించిన సీబీఐ... ఆమెను సాక్షిగానే కాక నిందితురాలిగానూ పేర్కొనకపోవడం గమనార్హం. శారదా చిట్ ఫండ్ యజమాని సుదీప్త సేన్, మనోరంజన్ గుప్తాల మధ్య జరిగిన ఒప్పందంలో నళిని కీలక భూమిక పోషించారన్న ఆరోపణలు వచ్చాయి. మనోరంజన్ తరఫున వకాల్తా పుచ్చుకున్న నళినికి శారదా చిట్ ఫండ్ నుంచి ఫీజు అందింది. అంతేకాక ఇరు పక్షాలకు అనుకూలమైన ఒప్పందం కుదర్చాల్సిన నళిని, మనోరంజన్ కు మాత్రమే అనుకూలంగా వ్యవహరించారని సుదీప్త ఆరోపించిన విషయాన్ని కూడా సీబీఐ చార్జిషీట్ లో పేర్కొంది.