: కాల్ డ్రాప్ కు రూ. 1 ఇవ్వని టెల్కోలు... ట్రాయ్ సీరియస్!
జనవరి 1 నుంచి సెల్ ఫోన్ కాల్ డ్రాప్ అయిన ప్రతిసారీ రూ. 1 చెల్లించాలన్న ఆదేశాలను టెలికం సంస్థలు పాటించకపోవడం పట్ల ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) సీరియస్ అయింది. వెంటనే పరిహారం చెల్లింపును ప్రారంభించాలని అన్ని సంస్థలకూ లేఖలు రాసింది. ఇందుకు సంబంధించిన టెక్నాలజీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. కాగా, ఈ విషయమై కోర్టులో కేసు నడుస్తున్నందున, తీర్పు వెలువడిన తరువాతనే పరిహారం ఇస్తామని టెల్కోలు భీష్మించుకుని కూర్చున్నాయి. కాగా, టెలికం వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ చట్టం ప్రకారం, కాల్ డ్రాప్ అయితే రూ. 1 (రోజుకు గరిష్ఠంగా మూడు కాల్ డ్రాప్ లకు) చెల్లించాలన్న ఆదేశాలు గత సంవత్సరం అక్టోబరు 16న జారీ అయిన సంగతి తెలిసిందే. ఇది అమలు చేస్తే, తాము తీవ్రంగా నష్టపోతామని టెల్కోలు అంటున్నాయి. నష్టాల పేరిట వినియోగదారులను ఇబ్బందులు పెడతారా? అన్నది ట్రాయ్ ప్రశ్న. సరైన సాంకేతికత, టవర్లు, సిగ్నల్ బలం లేకుండా సిమ్ కార్డులు జారీ చేసి, ఆపై ఫోన్ మధ్యలోనే కట్ అవుతుంటే చూస్తూ ఊరుకోబోయేది లేదని ట్రాయ్ గతంలోనే స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు పరిహారాన్ని అమలు చేసే ఉద్దేశం తమకు లేదని కాయ్ (సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మ్యాథ్యూస్ తెలిపారు. ఎన్నో అంశాలతో ముడిపడ్డ ఈ విషయంలో కోర్టు తీర్పునకు అనుగుణంగా నడుచుకుంటామన్నారు.