: 'రూపాయి' నోట్ల ముద్రణపై ఆర్థిక శాఖ వివరాలు
గత రెండు సంవత్సరాల్లో సుమారు 16 కోట్ల ఒక్క రూపాయి నోట్లను ఆర్థిక శాఖ జారీ చేసింది. రెండు దశాబ్దాల తరువాత మళ్లీ రెండేళ్ల కిందట ఒక్క రూపాయి నోటు ముద్రణను పునఃప్రారంభించింది. ఈ నేపథ్యంలో గత 20 ఏళ్లలో ఎన్ని రూపాయి నోట్లు జారీ అయ్యాయంటూ ఇద్దరు సమాచార హక్కు కార్యకర్తలు ఆర్థిక శాఖను కోరారు. ఇందుకు స్పందించిన ఆ శాఖ వివరాలు వెల్లడించింది. 1994-95లో 4 కోట్ల రూపాయి నోట్లను జారీ చేశామని, అప్పటి నుంచి 2013-14 వరకు రూపాయి నోట్ల ముద్రణ చేపట్టలేదని వెల్లడించింది. తరువాత 2014-15లో 5 కోట్ల రూపాయి నోట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో 15.5 కోట్ల రూపాయి నోట్లు ముద్రించినట్టు వివరించారు. 1994-95లో 4 కోట్ల రూపాయి నోట్ల ముద్రణకు 5.9 కోట్ల ఖర్చయిందని చెప్పారు. ఒక్కో నోటుకు రూ.1.48 చొప్పున వ్యయం అయిందని కరెన్సీ నోట్ల ప్రెస్ తెలిపింది. రెండు దశాబ్దాల తరువాత ఇంత వ్యయంతో రూపాయి నోట్లను జారీ చేయడం ఆర్ బీఐకి ఇష్టం లేకున్నా, నాటి యూపీఏ ప్రభుత్వం బలవంతంగా వాటి ముద్రణ ప్రారంభించిందని సమాచార కార్యకర్త అగర్వాల్ ఆరోపించారు.