: 800 ఏళ్ల నాడే మొబైల్ ఫోన్ వాడకం?... చరిత్రకారులకు దొరికిన ఆధారం!
ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో ఇమిడిపోయిన మొబైల్ ఫోన్లు 800 సంవత్సరాల క్రితమే ఉన్నాయంటే మీరు నమ్మగలరా? ఆస్ట్రియాలోని ఆర్కియాలజిస్టులు సేకరించిన ఆధారాలు చూస్తే, అవుననక తప్పదేమో! పరిశోధనలు సాగిస్తున్న బృందానికి మొబైల్ ఫోన్ ఆకారంలోని మట్టి నమూనా ఒకటి లభించింది. దీనిపై సుమేరియన్ అక్షరాలు సెల్ ఫోన్ నంబర్ల మాదిరిగా ఉన్నాయి. ఆపై డయల్, బ్యాక్, మెనూ కీస్ ఉన్నాయి. మెసపుటోమియాలో క్రీస్తు పూర్వం 3,500 నుంచి 3 వేల మధ్య సుమేరియన్లు అభివృద్ధి చేసిన లిపిలో ఈ అక్షరాలున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, తొలుత మార్కెట్లోకి వచ్చిన సెల్ ఫోన్ మోడల్ రూపంలో ఇది ఉండటంతో కొత్త ప్రశ్నలు ఉద్భవించాయి. ఈ మట్టి ఆకృతి ఏంటన్నది ఇప్పటికీ తెలియనప్పటికీ, దీని వెనక ఆసక్తికర అంశాలు దాగుండవచ్చని, వాటిని కనుగొనే ప్రయత్నం చేస్తున్నామని పురాతత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు.