: రెండు గ్రూపులుగా విడిపోయి... ఉగ్రవాదుల ముప్పేట దాడి


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిపిన దాడిలో ఉగ్రవాదులు పక్కా వ్యూహంతో వ్యవహరించారు. పాకిస్థాన్లోని రావల్పిండిలో రూపుదిద్దుకున్న ఈ వ్యూహం ప్రకారం మొత్తం 8 మంది ఉగ్రవాదులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. భద్రతా దళాల అటకాయింపు ఎదురైనా, దాడి జరిగితీరాల్సిందేనన్న కోణంలో గట్టి నిర్ణయం తీసుకునే ఉగ్రవాదులు రంగప్రవేశం చేసినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే 8 మంది ఉగ్రవాదులు నలుగురేసి చొప్పున రెండు గ్రూపులుగా విడిపోయి, వేర్వేరుగానే ఎయిర్ బేస్ లోకి ప్రవేశించినట్లు సమాచారం. ఎయిర్ బేస్ ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు పట్టేసినా దొరకకుండా ఉండాలన్న భావనతోనే ఉగ్రవాదులు ఈ తరహా వ్యూహాన్ని రచించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఓ గ్రూపును గమనించిన భద్రతా దళాలు కొన్ని గంటల్లోనే వారిని మట్టుబెట్టేశాయి. ఇక అప్పటికే కాస్తంత లోపలికి చొచ్చుకువెళ్లిన మరో గ్రూపు భద్రతా దళాల సత్తాకు సవాల్ విసిరేలా మూడు రోజులుగా కాల్పులు జరుపుతూ, పేలుళ్లకు పాల్పడుతూ పెను నష్టాన్ని మిగిల్చే దిశగా ప్రతాపం చూపుతోంది. అయితే నిన్న రాత్రికే ఈ గ్రూపులోని ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టిన భద్రతా దళాలు, మరో ఇద్దరిని రౌండప్ చేశాయి. నేటి సాయంత్రంలోగా కౌంటర్ ఆపరేషన్ ను పూర్తి చేసి తీరాల్సిందేనన్న పట్టుదలతో భద్రతా దళాలు సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News