: ఏపీ, కర్ణాటకల మధ్య 'బస్సు' వార్!
కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సులను ఆంధ్రప్రదేశ్ అధికారులు సీజ్ చేయగా, దానికి ప్రతీకారంగా ఏపీ బస్సులను కర్ణాటక సీజ్ చేసింది. ఇరు రాష్ట్రాల మధ్యా రెండు ఆర్టీసీలకు చెందిన బస్సులు తిరుగుతున్నా, ఇంతవరకూ సీజ్ చేసిన ఘటనలు లేవు. ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో పర్మిట్ లేకుండా ప్రవేశించిన నాలుగు బస్సులను నిబంధనల ప్రకారం అధికారులు సీజ్ చేశారు. ఆ వెంటనే గౌరీ బిదనూరు సమీపంలో ఎనిమిది ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను ఏ కారణమూ చూపకుండానే సీజ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై కర్ణాటక అధికారులతో మాట్లాడుతున్నామని, బస్సుల సీజ్ పై కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని ఏపీ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.