: తప్పక తెలుసుకోండి... 2016లో మీ జీవన గమనాన్ని ప్రభావితం చేసి, డబ్బు మిగిల్చే అంశాలు!


జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా, కొన్ని కీలక నిర్ణయాలను నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాలు భారతీయుల జీవితంపై శాశ్వత ప్రభావాన్ని చూపనున్నాయి. ఇదే సమయంలో కొంత డబ్బును భవిష్యత్ అవసరాల నిమిత్తం ఆదా చేసుకునే అవకాశాన్నీ దగ్గర చేస్తున్నాయి. అవేంటంటే... 7వ వేతన సంఘం సిఫార్సులు: కొత్త సంవత్సరంలో అమిత ప్రభావం చూపనున్నది 7వ వేతన సంఘ సిఫార్సులు. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ సిఫార్సులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మరింత ఆదాయాన్ని అందిస్తాయి. పెట్రోలు/డీజెల్ ధరల తగ్గదల: ఇటీవలి కాలంలో తగ్గుతూ వచ్చిన పెట్రోలు, డీజెల్ ధరలు ప్రతి ఒక్కరికీ, తమ జేబులో ఎంతో కొంత డబ్బును ఆదా చేస్తున్నాయి. కాల్ డ్రాప్ పరిహారం: ప్రతి ఒక్కరి చేతిల్లో మొబైల్ ఫోన్లు సర్వసాధారణమై పోయిన వేళ, ఎక్కడన్నా కాల్ డ్రాప్ అయితే, సేవలందిస్తున్న టెలికం సంస్థ మీ మొబైల్ ఖాతాలో రూ. 1 (రోజుకి గరిష్ఠంగా మూడు సార్లు మాత్రమే) వేయక తప్పదు. ఇవన్నీ డబ్బు ఆదా చేసే అంశాలు కాగా, జీవనంపై ప్రభావం చూపే కేంద్ర నిర్ణయాలు ఏంటంటే... పాన్ సంఖ్య: రూ. 50 వేలు దాటే ఏ లావాదేవీకైనా ఇకపై పాన్ సంఖ్య నమోదు తప్పనిసరి. పన్ను ఎగ్గొట్టేవారి పీచమణిచేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుంది. తగ్గిన ఏటీఎఫ్ ధరలతో విమాన ప్రయాణం సులువు: ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరల పతనం కారణంగా, విమాన ఇంధన ధరలు దిగొచ్చాయి. దీంతో, పోటీ అధికంగా ఉన్న భారత విమానయాన రంగంలో ఆఫర్ల మీద ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ముందుగా ప్లాన్ చేసుకుంటే, రైలు స్లీపర్ చార్జీ టికెట్ ధరతోనే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకునే వీలు దగ్గరైంది. తగ్గుతున్న సీఎన్జీ ధరలు: పెట్రోలు, డీజిల్ లతో సమానంగా సీఎన్జీ (కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్) ధరలు తగ్గుతూ వస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేయాలని భావిస్తున్న ప్రభుత్వం, పెట్రోలు, డీజిల్ తదితరాల ధరలు తగ్గినప్పుడు అదనపు సుంకాలు విధిస్తూ, సీఎన్జీపై మాత్రం పన్నులు వేయడం లేదు. ఎల్పీజీ సబ్సిడీలో కోత: ఒక సంవత్సరంలో రూ. 10 లక్షల కన్నా అధిక ఆదాయం పొందేవారికి ఎల్పీజీ సబ్సిడీలను తొలగించాలన్న నిర్ణయం దాదాపు 2 లక్షలకు పైగా కుటుంబాలపై పడనుంది. వీరంతా పన్ను పరిధిలో ఉండటంతో, ఇకపై మార్కెట్ ధరకు వంటగ్యాస్ కొనాల్సిందే.

  • Loading...

More Telugu News