: సినిమాలలో ఇకపై మరణించాలనుకోవట్లేదు!: రణ్ వీర్ సింగ్
బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ ఇకపై మరణించాలనుకోవడం లేదని అన్నాడు. రణ్ వీర్ సింగ్ గతంలో సోనాక్షి సిన్హాతో నటించిన లుటేరా; అర్జున్ కపూర్, ప్రియాంక చోప్రాలతో నటించిన గూండే, తాజాగా విడుదలైన బాజీరావ్ మస్తానీ సినిమాల క్లైమాక్స్ లలో హీరో మరణిస్తాడు. దీంతో తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు బాధపడుతున్నారని, నూతన సంవత్సరంలో కొత్త నిర్ణయం తీసుకున్నానని, ఇకపై ఇలా సినిమాలలో మరణించాలనుకోవడం లేదని చెప్పాడు. అయితే కథకు అనుగుణంగా సినిమాలు సాగుతాయని, కధ బలమైనదైతే పాత్ర మరణించాల్సిందేనని, అప్పుడే ఆ పాత్ర ప్రేక్షకుల దృష్టిలో సజీవంగా ఉంటుందని రణ్ వీర్ సింగ్ తెలిపాడు. క్లైమాక్స్ లో మరణించే బాజీరావ్ మస్తానీ సినిమాను చూసేందుకు మొదట్లో తన తల్లి అంగీకరించలేదు. నెమ్మదిగా ఒప్పించాక ఆమె చూశారని, అయితే క్లైమాక్స్ లో మరణించే సందర్భలో ఆమె చాలా బాధపడ్డారని రణ్ వీర్ తెలిపాడు. దీంతో ఇకపై క్లైమాక్స్ లో మరణించే పాత్రలు చేయకూడదని భావిస్తున్నానని చెప్పాడు.