: ఏపీలో అరాచక పాలన... టీడీపీ నేతల పేరిట జీవోలా?: చంద్రబాబు సర్కారుపై రోజా విసుర్లు


ఏపీ అసెంబ్లీలో సీఎం నారా చంద్రబాబునాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఏడాది పాటు సస్పెన్షన్ కు గురైన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోమారు ప్రభుత్వంపై ఎదురు దాడికి దిగారు. సస్పెన్షన్ వ్యవహారంపై విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న కొద్దిసేపటికే ఆమె మీడియా ముందుకు వచ్చారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని మొదలు పెట్టిన ఆమె, ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీలను చూపిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సీనియర్ నేత భూమా నాగిరెడ్ది కూతురు అఖిల ప్రియ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధి పేరిట రూ.2 కోట్ల నిధులను విడుదల చేస్తూ జారీ చేసిన జీవోలో టీడీపీ నేత గంగుల ప్రభాకరరెడ్డిని ఎమ్మెల్యేగా పేర్కొన్నారని ఆమె ఆరోపించారు. అంతేకాక డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి నియోజకవర్గం డోన్ లోనూ ఆయన సోదరుడి పేరును ప్రస్తావిస్తూ రూ.2 కోట్లను ఎలా విడుదల చేస్తారని ఆమె ప్రస్తావించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెబుతున్న చంద్రబాబుకు జీవోల జారీలో చట్టసభల మార్గదర్శకాలను పాటించాలని తెలియదా? అని ఆమె ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News