: కార్లు కొనేస్తున్నారు... భారీగా పెరిగిన అమ్మకాలు
గడచిన డిసెంబర్ నెలలో ఇండియాలో వాహన అమ్మకాలు పెరిగాయి. దేశంలో అత్యధికంగా వాహనాలను విక్రయిస్తున్న మారుతి సుజుకితో పాటు హ్యుందాయ్ మోటార్స్ తదితర సంస్థలు తమ అమ్మకాలు పెరిగాయని ప్రకటించాయి. మారుతి సుజుకి విక్రయాలు డిసెంబర్ 2014తో పోలిస్తే 1.09 లక్షల యూనిట్ల నుంచి 1.19 లక్షల యూనిట్లకు పెరిగి 8.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దేశవాళీ అమ్మకాల్లో 13.5 శాతం వృద్ధిని నమోదు చేశామని ఆ సంస్థ ప్రకటించింది. పాసింజర్ కార్ల అమ్మకాల్లో 11.6 శాతం వృద్ధి సాధించామని, గ్రాండ్ విటారా, ఎర్తిగా అమ్మకాలు 50 శాతానికి పైగా పెరిగాయని పేర్కొంది. ఇక హ్యుందాయ్ మోటార్ ఇండియా 28.8 శాతం అధికంగా వాహన విక్రయాలు సాగించామని ప్రకటించింది. ఇదే సమయంలో ఎగుమతులు తగ్గాయని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ శ్రీవాత్సవ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రాండ్ ఐ10, ఎలైట్ ఐ20, క్రెటా యూనిట్ల విక్రయాలు ప్రోత్సాహకరంగా సాగాయని తెలిపారు. మొత్తం మీద 2015లో 4.76 లక్షల యూనిట్లను విక్రయించి 15.7 శాతం అమ్మకాల వృద్ధిని సాధించామని వివరించారు. మిగతా కార్ల కంపెనీల డిసెంబర్ అమ్మకాల వివరాలు తెలియాల్సి వుంది.