: నెట్టింట పెద్ద చర్చ... బేసి సంఖ్య నంబరుంటే బెస్ట్!


ఢిల్లీలో సరి-బేసి కార్లను రోజు విడిచి రోజు తేదీల ప్రకారం రోడ్లపైకి వదలాలని ప్రభుత్వం నిర్ణయించిన వేళ, సామాజిక మాధ్యమాల్లో ఓ కొత్త చర్చ మొదలైంది. కార్ల నంబర్లు బేసి సంఖ్యగా ఉన్నవారికి ప్రయోజనాలు అధికమన్నదే ఈ చర్చ. అదెలాగంటే, ఏదైనా నెలలో 31 రోజులు వచ్చినప్పుడు 31వ తేదీన, ఆపై 1వ తేదీన వరుసగా రెండు రోజుల పాటు ఆ వాహనాలు రోడ్డెక్కవచ్చు. ఇక సరి సంఖ్య ఉన్న వాహనాలు 30వ తేదీ రహదారులపై తిరిగితే, ఆ తరువాత మూడవ రోజు మాత్రమే వీధుల్లోకి రాగలుగుతాయి. ఇక, కేజ్రీవాల్ సర్కారు తీసుకున్న ఆడ్-ఈవెన్ ఫార్ములా శాశ్వతంగా అమలయ్యే పక్షంలో, తమ వాహనాలకు బేసి సంఖ్య నంబర్ కావాలని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద వాహన కొనుగోలుదారులు క్యూ కడతారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. జనవరి, మార్చి, మే, జూలై, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్ నెలల్లో 31 రోజులు వస్తున్నాయన్న సంగతి తెలిసిందే. అంటే బేసి సంఖ్యగల కారుంటే, సంవత్సరంలో అదనంగా 7 రోజుల పాటు తిరగొచ్చు. ఇక లీప్ సంవత్సరం వస్తే ఫిబ్రవరిలో కూడా బేసి సంఖ్య వాహనాలకు లాభమే. అదీ సంగతి!

  • Loading...

More Telugu News