: పుతిన్ తో వియ్యానికి గడాఫీ యత్నం... ససేమిరా అన్న రష్యా అధ్యక్షుడు!


లిబియా నియంత గడాఫీ గుర్తున్నారుగా! నాటో సైన్యం దన్నుతో లిబియా తిరుగుబాటుదారులు 2011లో చేసిన దాడుల్లో బుల్లెట్ గుళ్ల కారణంగా శరీరం చిల్లులు పడిన స్థితిలో నడిరోడ్డుపైనే ప్రాణాలు వదిలారు. గడాఫీ మరణించిన తీరు నాడు పలువురుని ఆశ్చర్యానికి గురి చేసింది. అగ్రరాజ్యం అమెరికానే గడగడలాడించిన గడాఫీ దిక్కులేని చావు చచ్చారని నాడు కథనాలు వెలువడ్డాయి. సదరు గడాఫీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో వియ్యం పొందడానికి తాపత్రయపడ్డారు. తన రెండో కొడుకు సయిఫ్ అల్ ఇస్లామ్ గడాఫీకి పుతిన్ కూతురుతో వివాహం జరిపించాలని గడాఫీ యత్నించారు. పుతిన్ తో భేటీ సందర్భంగా స్వయంగా గడాఫినే నోరు తెరిచి ఈ ప్రతిపాదన చేశారు. వారిద్దరి మధ్య పెళ్లితో న రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని కూడా గడాఫీ ప్రతిపాదన చేశారు. ‘మా అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం’ అన్న గడాఫీ ప్రతిపాదనను పుతిన్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ‘మా అమ్మాయికి మీ అబ్బాయి తెలియడుగా?’ అంటూ పుతిన్ ఒక్కమాటలో గడాఫీ ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ మేరకు నాటి గడాఫీ ప్రతిపాదన, పుతిన్ తిరస్కరణపై ఇస్లామిక్ రచయిత మొహ్మద్ అబ్దెల్ మొతలబ్ అల్ హౌనీని ఊటంకిస్తూ ‘అల్ అరేబియా’ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ తర్వాతి కాలంలో గడాఫీ నడిరోడ్డుపై ప్రాణాలు విడవగా, ఆయన కుమారుడు సయిఫ్ మరణ శిక్షకు గురై లిబియా పట్టణం జింటాన్ లోని జైల్లో చివరి రోజులు లెక్కిస్తున్నారు.

  • Loading...

More Telugu News