: హైదరాబాద్ రాజ్ భవన్, విజయవాడ చంద్రబాబు క్యాంపు కిటకిట!
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ నివాసం రాజ్ భవన్ ఈ ఉదయం నుంచి ప్రముఖుల రాకతో సందడిగా మారింది. గవర్నర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వీఐపీలు పోటెత్తారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి, చందూలాల్, తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, డీజీపీ తదితరులు గవర్నర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నరసింహన్ ప్రసంగిస్తూ, కొత్త సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని కోరుకుంటున్నట్టు వివరించారు. ఏపీ, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. మరోవైపు అమరావతిలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయం ప్రజలతో కిక్కిరిసిపోయింది. చంద్రబాబుకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పేందుకు పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పాటు సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. దీంతో క్యాంపు కార్యాలయ ప్రాంతం రద్దీగా మారింది.