: కేజ్రీ ఫార్ములా గ్రేట్!... ‘సరి-బేసి’పై బీజేపీ ఆసక్తికర కామెంట్
కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని ఢిల్లీని కాపాడేందుకు ఆప్ వ్యవస్థాపక అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ‘సరి- బేసి’ ట్రాఫిక్ ఫార్ములా నేటి ఉదయం అమల్లోకి వచ్చేసింది. జనం నుంచి ఊహించని స్పందన వస్తోంది. దీంతో నిన్నటిదాకా పాలనాపరమైన వ్యవహారాలతోనే కాక రాజకీయ వర్గ వైషమ్యాలతో హీటెక్కిన కేజ్రీవాల్ బుర్రకు కాస్తంత రిలీఫ్ దొరికింది. అంతేకాదండోయ్, నిత్యం కేజ్రీని టార్గెట్ చేస్తున్న బీజేపీ కూడా ఆయన రూపొందించిన సరికొత్త ఫార్ములాను స్వాగతించింది. దీంతో కేజ్రీ ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. సరికొత్త ట్రాఫిక్ ఫార్ములాపై కొద్దిసేపటి క్రితం స్పందించిన బీజేపీ సీనియర్ నేత, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ, సరి-బేసి ట్రాఫిక్ ఫార్ములా మంచి ఫలితాలనివ్వనుందని పేర్కొన్నారు. సరికొత్త ఫార్ములా అయినా జనం బాగా స్పందిస్తున్నారని చెప్పిన ఆయన ఈ ఫార్ములా అద్భుతంగా ఉందని కీర్తించారు. అదే సమయంలో ఆయన కేజ్రీపై విమర్శలు గుప్పించకుండా ఉండలేకపోయారు. సరికొత్త ఫార్ములా అయినప్పటికీ కేజ్రీ దీనికి రాజకీయ దురుద్దేశాలను ఆపాదించారని నక్వీ ఆరోపించారు.