: కత్తి పట్టిన ‘అమ్మ’... కదన రంగంలోకి దూకండని కార్యకర్తలకు పిలుపు
చుట్టుముట్టిన కేసులను ఛేదించుకున్న ‘అమ్మ’ జయలలిత తిరిగి తమిళనాడు పాలనా పగ్గాలు చేజిక్కించుకున్నారు. ఆ క్రమంలో జరిగిన ఉప ఎన్నికలో ఆమెపై అభ్యర్థిని బరిలోకి దించేందుకు విపక్షాలు సాహసించలేకపోయాయి. ఇక నాలుగు నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న అన్నాడీఎంకే పార్టీ కార్యవర్గ సమావేశం తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా వరుసగా ఏడోసారి ‘అమ్మ’నే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీలో కీలక నిర్ణయాలన్నీ తీసుకునే కీలక అధికారం కూడా ‘అమ్మ’కే దఖలు పడింది. ఈ సందర్భంగా కార్యకర్తలు అందించిన కత్తి పట్టిన జయలలిత ఎన్నికల కదన రంగంలోకి దూకాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అబద్ధాలు చెప్పుకుంటూ బురద జల్లుతున్న విపక్షం డీఎంకేకు గట్టి ఎదురు దెబ్బ తగిలేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక భవిష్యత్తులో పార్టీకి ఓటమి అన్నదే ఎదురు కాదని కూడా ఆమె ధీమా వ్యక్తం చేశారు. తన రాజ భవంతి పోయెస్ గార్డెన్ నుంచి బయలుదేరిన జయలలితకు పార్టీ కార్యాలయం దాకా రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డ పార్టీ కార్యకర్తలు దారిపొడవునా స్వాగతం పలకగా, కార్యకర్తలకు అభివాదం చేస్తూ జయలలిత సాగిపోయారు.