: ఆస్తి పన్ను తగ్గింపుతో గ్రేటర్ పరిధిలో 5.09 లక్షల మందికి ఊరట!


గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) వాసులకు తెలంగాణ ప్రభుత్వం మరో తాయిలాన్ని ప్రకటించింది. ఆస్తి పన్ను రూ.1,200 లోపు ఉన్న నగరవాసులు రూ.101 చెల్లిస్తే సరిపోతుందట. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిన్న అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే నల్లా బిల్లులను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, తాజాగా ఆస్తి పన్ను చెల్లింపులోనూ నగర వాసులకు ఊరటినిచ్చేలా వ్యవహరించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జీహెచ్ఎంసీ ఖజానాకు భారీగానే గండి పడనున్నప్పటికీ, జంట నగరాల వాసుల్లో మాత్రం హర్షం వ్యక్తమవువోంది. ఆస్తి పన్ను రూ.1,200 లోపు ఉన్న గృహస్థుల సంఖ్య జంట నగరాల్లో 5,09,187గా ఉన్నట్లు జీహెచ్ఎంసీ రికార్డులు చెబుతున్నాయి. వీరి నుంచి ఈ ఏడాది జీహెచ్ఎంసీకి రూ.29.40 వసూలు కావాల్సి ఉంది. అంతేకాక బకాయిల కింద మరో రూ.57.99 కోట్లు రావాల్సి ఉంది. అంటే, నగరవాసుల నుంచి ఒక్క ఆస్తి పన్ను కిందే ప్రభుత్వానికి రూ.87.39 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ మొత్తం వసూలు భారీగా తగ్గనుంది. అంతేకాక జంట నగరాల్లో మొత్తం 14.50 లక్షల మంది ఆస్తి పన్ను చెల్లింపుదారులుండగా, 5.09 లక్షల మందికి ఊరట కలగనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News