: విధి ఆడిన వింత నాటకం... ఒకే చోట పనిచేస్తున్నా వారు తల్లీ కొడుకులని తెలియదు!
అతను తన కన్న తల్లి కోసం వెతుకులాటలో నాలుగేళ్ల పాటు కష్టపడ్డాడు. చివరికి ఆమె ఎవరో తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. తాను పనిచేస్తున్న చోటనే, అదే యజమాని వద్దనే ఆమె కూడా పనిచేస్తోంది. నిత్యమూ చూస్తూనే ఉన్నా ఆమె తన తల్లి అని అతడికి తెలియదు. అతను తన కుమారుడని ఆమెకు తెలియదు. విధి ఆడే వింత నాటకాలకు ఇది ఓ ఉదాహరణ. సినిమా కథను తలపించే ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... స్టీవ్ ఫ్లయిగ్ అనే యువకుడు మిచిగాన్ లోని ఓ సంస్థలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతనికి 18 ఏళ్ల వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఓ చేదు నిజం చెప్పారు. "నువ్వు మా కన్న కొడుకువు కాదు, నిన్ను దత్తత తెచ్చుకున్నాం" అన్న వారి మాటలు విన్న స్టీవ్, తన కన్న తల్లిని వెతకాలని నిశ్చయించుకున్నాడు. తెలిసిన కొద్ది వివరాల సాయంతో నాలుగేళ్లు వెతికాడు. ఫలితం లేకపోవడంతో, ఇక తన తల్లి దొరకదేమో అని ఆందోళన చెందాడు. ఈ క్రమంలో ఒకరోజు తన బాధను యజమానితో పంచుకుంటూ, తల్లి గురించి తెలిసిన వివరాలు చెప్పాడు. స్టీవ్ చెప్పిన వివరాలన్నీ విన్న యజమాని, "ఇక్కడే పనిచేస్తున్న క్రిస్టిన్ టల్లాడియే మీ అమ్మ" అని చెప్పాడు. దీంతో తన తల్లిని కలుసుకున్న స్టీవ్ ఆనందానికి అంతులేకుండా పోయింది.