: తమిళ నటుడు శింబుపై మరో రెండు పిటిషన్లు ఉపసంహరణ
బీప్ సాంగ్ వివాదం నుంచి తమిళ నటుడు శింబు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టు కనిపిస్తోంది. ఆయనపై దాఖలైన పిటిషన్ లను ఒక్కొక్కటిగా ఉపసంహరించుకుంటున్నారు. రెండు రోజుల కిందట చెన్నై సైదాపేట కోర్టులో పీఎంకే పార్టీ నేత దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు. తాజాగా శింబు, సంగీత దర్శకుడు అనిరుధ్ లపై 'విడుదలై చిరుతైగల్' పార్టీకి చెందిన దక్షిణ చెన్నై న్యాయవాదుల సంఘం కార్యదర్శి వక్ శీల్ కాశీ, అదేవిధంగా కేకే నగర్ కు చెందిన అదే పార్టీ కార్యదర్శి పుదయవన్ అలియాస్ లక్ష్మణన్ లు తమ పిటిషన్ లను ఉపసంహరించుకున్నారు. ఇటీవల శింబు తల్లి ఈ వ్యవహారంపై కన్నీటి పర్యంతమైన నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పవచ్చు. మరోవైపు శింబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై మద్రాస్ హైకోర్టులో జనవరి 4న విచారణ జరగనుంది.