: భారత్ లో 100 కోట్లు దాటిన మొబైల్ కస్టమర్ల సంఖ్య!
అనుకుంటున్నదే జరిగింది. చైనా తరువాత జనాభా సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు మరో విషయంలో కూడా ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. దేశంలో మొబైల్ వినియోగదారుల సంఖ్య తాజాగా 100 కోట్లు దాటినట్టు ట్రాయ్ తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ లోనే దాదాపు 70 లక్షల మంది కొత్తగా మొబైల్ కనెక్షన్లు తీసుకున్నారని, దాంతో వంద కోట్ల మార్క్ ను దాటిందని ట్రాయ్ వెల్లడించింది. అయితే చైనా 2012లోనే 100 మార్క్ ను దాటగా... భారత్ ఇప్పుడు ఆ లక్ష్యాన్ని ఛేదించిందని వివరించింది. ప్రస్తుతం టెలికాం రంగంలో ప్రైవేటు ఆపరేటర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉండడంతో ప్రజలకు తక్కువ ధరలకే కమ్యూనికేషన్ సేవలను అందిస్తున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మొబైల్ సబ్ స్క్రైబర్ల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతూ వస్తోందని ట్రాయ్ వివరించింది. కాగా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ కమ్యూనికేషన్ రంగంలో బీహార్ వెనుకబడి ఉందని తెలిపింది. అక్కడ 100 మందిలో కేవలం 54 శాతం మందికే ఫోన్ కనెక్షన్ లు ఉన్నాయని, ఇది చాలా అత్యల్పమని చెప్పింది.