: 42 ఏళ్ల తరువాత రవిచంద్రన్ అశ్విన్ అత్యంత అరుదైన ఘనత!


1973 తరువాత ఓ అరుదైన ఘనతను సాధించిన భారతీయ క్రికెటర్ గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. 2015 సంవత్సరాన్ని నంబర్ వన్ బౌలర్ గా, నంబర్ వన్ ఆల్ రౌండర్ గా ముగించాడు. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం, అశ్విన్ కు రెండు విభాగాల్లో టాప్ పొజిషన్ దక్కగా, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ నంబర్ వన్ బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ఈ సంవత్సరంలో 9 టెస్టు మ్యాచ్ లను ఆడిన అశ్విన్ మొత్తం 62 వికెట్లు తీసి అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 1973లో, అప్పటి క్రికెటర్ బిషన్ బేడీ ఈ ఘనత సాధించగా, మరో ఆటగాడు దాన్ని అందుకోవడానికి 42 సంవత్సరాలు పట్టడం గమనార్హం. కపిల్ దేవ్, భగవత్ చంద్రశేఖర్, అనిల్ కుంబ్లేలు తమ కెరీర్ పీక్ దశలో ఉన్న సమయంలో సైతం 2వ స్థానానికి మాత్రమే చేరగలిగారు. ఇటీవలి కాలంలో బౌలర్లలో షేన్ వార్న్ 2005లో, ముత్తయ్య మురళీధరన్ 2006 నుంచి 2008 వరకు టాప్ పొజిషన్లో నిలువగా, స్టెయిన్ 2013 నుంచి ఆ స్థానంలో ఉన్నాడు. తనకు లభించిన గౌరవాన్ని గురించి అశ్విన్ స్పందిస్తూ, "2015ను అత్యుత్తమంగా ముగించడం మరచిపోలేనిది. గడచిన 12 నెలల కాలంలో మంచి ప్రతిభను చూపేందుకు ఇతర క్రికెటర్ల సూచనలు ఎంతో ఉపకరించాయి. ముఖ్యంగా కెప్టెన్ కోహ్లీ సహకారం మరువలేనిది" అని వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News