: ఇప్పుడు పదేళ్లలోపున్న బాలురకు రేపు పెళ్లిళ్లు అత్యంత క్లిష్టం!
ఇండియాలో స్త్రీ, పురుషుల నిష్పత్తి 1961 నాటి కనిష్ఠానికి పడిపోయి ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం పదేళ్లలోపున్న బాలురు పెళ్లీడుకు వచ్చేసరికి సరిపడా అమ్మాయిలు లభించని పరిస్థితి. 2011 నాటి జనాభా లెక్కల వివరాలు మదింపు తరువాతి గణాంకాలు విడుదల కాగా, ఆరేళ్లలోపు వారిలో ప్రతి 1000 మంది బాలురకు, 918 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. 2001 జనాభా లెక్కలతో పోలిస్తే బాల, బాలికల నిష్పత్తి 927:1000 నుంచి మరింతగా తగ్గడం ఆందోళనకరమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఇండియాలో 80 శాతం జనాభా ఉన్న హిందువుల విషయానికి వస్తే, 1000 మంది బాలురకు 913 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. ఒక్క సిక్కులు, జైనుల్లో మాత్రమే 2001తో పోలిస్తే గణాంకాలు మెరుగుపడ్డాయి. 2001లో సిక్కు వర్గంలో 786గా ఉన్న అమ్మాయిల నిష్పత్తి ఆపై పదేళ్లలో 828కి, జైనుల్లో 870 నుంచి 889కి పెరిగింది. మిగతా అన్ని వర్గాల్లో లింగ నిష్పత్తి తగ్గింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, దీంతో నేటి చిన్నారులు, మరో పదిపదిహేనేళ్ల తరువాత పౌరులుగా మారిన వేళ వారికి వివాహాలు అత్యంత క్లిష్టమయ్యే ప్రమాదం తప్పదు.