: కేజ్రీ వినూత్న దండన... నిబంధనలు మీరితే వాహనం పార్కింగ్ కు నో!


రేపటి నుంచి ఢిల్లీలో వాహన రిజిస్ట్రేషన్ సంఖ్య ఆధారంగా 'సరి-బేసి' విధానం అమలుకానున్న నేపథ్యంలో నిబంధనలు మీరే వారికి శిక్షలపై కేజ్రీ సర్కారు మరో నిర్ణయం తీసుకుంది. తప్పు చేసే ప్రజలపై కఠినంగా వ్యవహరించి, విమర్శల పాలు కాకుండా, వీరికి వినూత్న దండన విధించనుంది. సరి సంఖ్య ఉన్న వాహనాలు రోడ్లపై తిరుగుతున్న వేళ, బేసి సంఖ్య ఉన్న వాహనం బయటకు వస్తే దానిని పార్కింగ్ చేసుకునేందుకు ఎక్కడా అనుమతించరు. మాల్ కు వెళ్లినా, రోడ్లపై షాపింగ్ కు వెళ్లినా, కారును ఎక్కడా పార్క్ చేయనీయరు. ఈ శిక్ష ఒకసారి అమలైతే, ప్రజలు తప్పు చేయరన్నది కేజ్రీ అభిమతం. ఇక ఒకసారి రోడ్డుపైకి వచ్చి పట్టుబడితే, పోలీసులు విధించే జరిమానా చెల్లించిన తరువాత, దాన్ని చూపుతూ, ఇంకెవరైనా పట్టుకున్నా బయటపడొచ్చు. అది కూడా రెండు గంటల సమయం మాత్రమే చెల్లుతుంది. నిబంధనలు అతిక్రమించే వారిపై పోలీసులు, అధికారులు దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలుంటాయని, గాంధీగిరిలోనే వారిని అడ్డుకొని నచ్చజెప్పాలని కేజ్రీవాల్ సూచించారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా కారు బయటకు వస్తే, రూ. 2 వేలు జరిమానా పడుతుందన్న సంగతి తెలిసిందే. వాహనానికి ఒక రోజులో రెండు సార్లు ఫైన్ విధించబోమని, అయితే, 2 గంటల తరువాత కూడా గమ్యస్థానానికి లేదా ఇంటికి చేరకుండా, మరోసారి పట్టుబడితే, అందుకు సరైన కారణాన్ని చూపాల్సి వుంటుందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.

  • Loading...

More Telugu News