: కేజ్రీవాల్ పై పరువునష్టం దావా వేయాలని డీడీసీఏ నిర్ణయం
ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య వ్యవహారం మరింత ముదురుతోంది. ఈ క్రమంలో కేజ్రీపై పరువునష్టం దావా వేయాలని డీడీసీఏ నిర్ణయించింది. తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్న ఢిల్లీ సీఎంపై పరువునష్టం దావా వేస్తామని ఆ సంస్థ కోశాధికారి రవీందర్ తెలిపారు. ఆయనతో పాటు బీజేపీ బహిష్కృత ఎంపీ కీర్తీ ఆజాద్ పై కూడా దావా కేసు దాఖలు చేయనున్నట్టు చెప్పారు. డీడీసీఏలో సెక్స్ రాకెట్ కూడా ఉందని, క్రికెటర్ల ఎంపికలో భాగంగా తన కుమారుడిని తీసుకోవాలని డీడీసీఏను అడిగితే... తన భార్యను శారీరక సుఖం కోసం పంపాలని ఓ అధికారి అడిగినట్టు తనకు ఓ సీనియర్ జర్నలిస్ట్ చెప్పాడని కేజ్రీ తాజాగా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డీడీసీఏ పైవిధంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేజ్రీపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.