: ఐదురోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డ కార్మికులు!
గనిలో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు సుమారు 120 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడ్డ సంఘటన చైనాలోని షాన్ డాంగ్ ప్రావిన్స్ లోని జిప్సమ్ గనిలో జరిగింది. గత శుక్రవారం జిప్సమ్ గని పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో అందులో సుమారు 29 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగడంతో సుమారు 20 మంది కార్మికులను రక్షించారు. మిగిలిన 9 మంది కార్మికులు గనిలో చిక్కుకుపోయారు. దీంతో వారిని రక్షించేందుకు గాను ఐదురోజుల పాటు సహాయకచర్యలు కొనసాగాయి. ఎట్టకేలకు, 8 మంది కార్మికులను ప్రాణాలతో బయటకు తీసుకురాగలిగారు. ఒక కార్మికుడు మాత్రం మృతి చెందాడు. గని నుంచి బయటకు తీసుకువచ్చిన కార్మికులను ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందించారు. కాగా, గని కూలిన మర్నాడు దాని యజమాని 'మా కాంగ్బో' ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు.